Uncategorized

హామీలు నిలబెట్టుకోలేకనే ‘దిగజారుడు’ రాజకీయం.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలే చావుదెబ్బ కొడతారు.

కేసీఆర్ లాంటి గొప్ప నాయకునిపై నీచ రాజకీయాలు తగవు.

మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

జగిత్యాల, సెప్టెంబర్ 8(TELANGANA INSIGHT):
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి సర్కార్ ఆకతాయి వేషాలు వేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలే రాబోయే రోజుల్లో ‘చావుడప్పు’ కొడతారని జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మ్‌హౌస్ (ఎర్రవల్లి) ముట్టడికి, ‘చావుడప్పు’ మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, ప్రతినిధులను పోలీసుల ద్వారా గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేయడాన్ని విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులకు ఎస్కార్ట్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తూ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులను మాత్రం అరెస్టులు చేయడమేన ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి గొప్ప నాయకుడిపై ఇటువంటి నీచ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకే రక్షణ లేని పరిస్థితిని తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి పాలనను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి హితవు పలికారు.

తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, జగిత్యాల మున్సిపాలిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *